ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టిన బిల్ గేట్స్

  • డబ్యూహెచ్ఓకు నిధులను ఆపేస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంస్థ అవసరం ఎక్కువగా ఉందన్న బిల్ గేట్స్
  • డబ్ల్యూహెచ్ఓని వేరే సంస్థ భర్తీ చేయలేదని వ్యాఖ్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ)కు నిధులను ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ తప్పుపట్టారు. యావత్ ప్రపంచానికి ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితుల్లోనే డబ్ల్యూహెచ్ఓ అవసరం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులను ఆపివేయడం ప్రమాదకరమైన నిర్ణయమని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషి వల్లే కరోనా విస్తరణ నెమ్మదిస్తోందని... ఆ సంస్థ పనిచేయడాన్ని ఆపేస్తే... మరే ఇతర సంస్థ దాని స్థానాన్ని భర్తీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే. వాస్తవ సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ దాచడం వల్ల... ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 రెట్లు పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు నిధులను ఆపివేస్తున్నట్టు ప్రకటించారు.


More Telugu News