డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్ నిధులు నిలిపివేయడం పట్ల ఐరాస స్పందన

  • నిధులు నిలిపివేయడానికి ఇది సరైన సమయం కాదు
  • కరోనాపై ప్రపంచం మొత్తం తిరుగులేని పోరాటం చేస్తోంది
  • ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలి
  • ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలబడాలి
కొవిడ్‌-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసి, హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరకు అన్నంత పనీ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా నుంచి అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో చెప్పిన ప్రతి విషయం తప్పేనని, కరోనా పుట్టిన చైనాలో ఏం జరుగుతోందో ఆ సంస్థకు తెలుసని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ వైరస్‌ తీవ్రతను ఎందుకు అంచనా వేయలేకపోయారని మండిపడ్డ విషయం తెలిసిందే. అమెరికా ద్వారా డబ్ల్యూహెచ్‌వోకు ప్రతి ఏడాది 400 నుంచి 500 మిలియన్ డాలర్లు అందుతుంటే, చైనా నుంచి కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే అందుతున్నాయని ఆయన తెలిపారు.

నిధులు నిలిపివేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. నిధులు నిలిపివేయడానికి ఇది సరైన సమయం కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కరోనాపై ప్రపంచం మొత్తం తిరుగులేని పోరాటం చేస్తున్న సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నారు.

ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలబడాలని తెలిపారు. పాత  విషయాలను గుర్తు చేసుకుంటూ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతుగా నిలవాలని ఆయన చెప్పారు. కాగా, ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరువైంది.



More Telugu News