కళాశాల ఆవరణలో చెట్లకు గబ్బిలాలు...కరోనా వస్తుందేమోనని స్థానికుల్లో ఆందోళన

  • ఏలూరు పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో అదనపు రైతుబజార్‌
  • ఆవరణలో చెట్లకు భారీ సంఖ్యలో ఈ పక్షులు
  • వీటివల్లే వైరస్‌ వ్యాపిస్తోందన్న ప్రచారం
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై పుకార్లు షికార్‌ చేస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌కు పుట్టిల్లయిన చైనాలో గబ్బిలాలు, ఇతర జీవుల వల్ల కరోనా ఉద్భవించిందన్న వార్తలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అవే గబ్బిలాలను చూసి వైరస్‌ వస్తుందేమోనని భయపడుతున్నారు ఏలూరు వాసులు.

విషయంలోకి వెళితే...జనం ఒకేచోట గుమికూడకుండా  చూడాలని రాష్ట్ర ప్రభుత్వం పలు పట్టణాల్లో అదనపు రైతు బజార్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అదనపు రైతుబజార్‌ ఏర్పాటు చేశారు.

అయితే కళాశాల ఆవరణలోని చెట్లకు భారీగా గబ్బిలాలు వేలాడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దీంతో ఈ చెట్లకు వేలాడుతున్న గబ్బిలాల వల్లే కరోనా వ్యాపిస్తోందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో వీటిని చూసి కూరగాయలు కొనేందుకు వస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. వాటి నుంచి తమకు ఎక్కడ కరోనా వస్తుందో అని భయపడుతున్నారు.


More Telugu News