చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?: బుద్ధా వెంకన్న

  • కరోనా పెద్ద విషయం కాదన్నట్టు జగన్ మాట్లాడారు
  • ప్రజల ప్రాణాలు పోతే నాకేంటి అన్నట్టు వ్యవహరించారు
  • ఇంత మూర్ఖంగా వ్యవహరించేవారికి ఎవరు ఫోన్ చేస్తారు?
మూర్ఖంగా వ్యవహరించే వాడికి ఫోన్ చేసి కరోనా అంటించుకోవాలనే కోరిక ఎవరికి ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఫోన్ చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గుడ్డలు ఎందుకు చింపుకుంటున్నారని అన్నారు.

ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఊరేగారని...  ఫ్రంట్ గెలిస్తే జగనే ఉపప్రధాని అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారని... ఆ విషయాన్ని మర్చి పోయారా? అని ప్రశ్నించారు. ఎంపీలను గెలిపిస్తే మోదీ మెడలు వంచుతామని చెప్పి... ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత పోటీపడి మరీ మోదీగారి కాళ్లమీద జగన్ పడిన విషయం గుర్తు లేకపోతే ఎలా 'సాయిరెడ్డి' సాబ్ అని ప్రశ్నించారు.

'పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసించారు, పరామర్శించారు. కానీ జగన్ గారితో మాత్రం మోదీ వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడలేదని విజయసాయిరెడ్డికి అనుమానం రావడం, కోపం కట్టలు తెంచుకోవడం సహజమే. దానికి కారణం నేను చెబుతా.

పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది, బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది, కరోనా పెద్ద విషయం కాదు, అది వస్తుంది, పోతుంది అని జగన్ గారు సెలవిచ్చారు. ఎన్నికలు నిర్వహణే ముఖ్యం... ప్రజల ప్రాణాలు పోతే నాకేంటి అన్నట్టు వ్యవహరించారు. లాక్ డౌన్ కొనసాగించడానికి వీలులేదు అంటూ అజ్ఞాన ప్రదర్శన ఇచ్చారు. ఇంత మూర్ఖంగా వ్యవహరించే వాడికి ఫోన్ చేసి కరోనా అంటించుకోవాలనే కోరిక ఎవరికి ఉంటుంది పాపం' అంటూ వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.


More Telugu News