కరోనా కేసులపై జగన్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోంది!: టీడీపీ నేత కళావెంకట్రావు మండిపాటు

  • నిజాలు దాచి ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • రాజకీయ లబ్ధికోసం వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు
  • సర్కారు ఆసుపత్రుల్లో సాధారణ వైద్యం కూడా అందడం లేదు
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీలోని  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం  ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ధ్వజమెత్తారు. కరోనా కేసుల విషయంలో కాకి లెక్కలు చెబుతూ నిజాలను తొక్కి పెడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం వ్యవస్థలను ధ్వంసం చేయడం సరికాదని, దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.

ప్రభుత్వం తీరువల్ల వైద్యులు ఆసుపత్రులకు రావడానికి భయపడుతున్నారన్నారు. సరైన రక్షణ పరికరాలు ఇవ్వకున్నా, కనీస సౌకర్యాలు లేకున్నా వైద్యులు వృత్తి ధర్మాన్ని పాటించి వైద్యం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలావున్నాయో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రుల్లో కనీస వైద్యం అందడంలేదని, ప్రజలు చనిపోతున్నా వైద్యఆరోగ్య శాఖ మంత్రి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో ఓ బాలింత, నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి సకాలంలో వైద్యం అందక చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం ఈ మరణాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News