తన ఫోన్ నంబర్ ను సామాజిక మాధ్యమాల్లో పెట్టారంటూ... పోలీసులకు యువతి ఫిర్యాదు!
- మారేడ్ పల్లికి చెందిన యువతికి వేధింపులు
- ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఫోన్లు
- ఫేస్ బుక్ లో తన ఫోన్ నెంబర్ పెట్టారంటూ ఫిర్యాదు
తన ఫోన్ నంబర్ ను ఎవరో ఫేస్ బుక్ లో ఉంచారని, దీంతో తనకు నిత్యమూ వేధింపు కాల్స్ ఎదురవుతున్నాయని ఓ యువతి హైదరాబాద్, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లికి చెందిన ఓ యువతికి గత కొన్ని రోజులుగా ఫేక్ కాల్స్ వస్తున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో ఫోన్ చేసి, ఆమెను వేధిస్తున్నారు. తన ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారని అడుగుతూ ఉంటే, ఫేస్ బుక్ లో కనిపించిందని సమాధానం చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె, నిన్న సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చి, తన గోడును వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు, కేసును రిజిస్టర్ చేసుకుని, దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.