వైరస్ భయాన్ని పక్కన పెట్టేసిన సౌత్ కొరియా... పార్లమెంటు ఎన్నికల పోలింగ్ షురూ!

  • అన్ని జాగ్రత్తలూ తీసుకున్న అధికారులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 4.39 కోట్ల మంది
  • జ్వర పరీక్షల అనంతరమే ఓటు
  • మాస్క్ లు, చేతులకు గ్లౌజులు తప్పనిసరన్న అధికారులు
కరోనా వైరస్ భయాన్ని పక్కన పెట్టేసిన సౌత్ కొరియా, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైంది. ఓటర్ల శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తామని, జ్వరం ఉన్న వారికి విడిగా, క్వారంటైన్ లో ఉన్న వారికి విడిగా పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశామని, కరోనా ఆందోళనలోనూ, పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కరోనా వెలుగులోకి వచ్చిన తరువాత ఎన్నికలు జరిపిస్తున్న తొలి దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. నేడు దేశవ్యాప్తంగా పోలింగ్ కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం 4.39 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ లను ధరించాలని, జ్వర పరీక్షల అనంతరం అధికారులు సూచించిన బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, సామాజిక దూరం పాటించడం తప్పనిసరని అధికారులు నిబంధనలు విధించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచామని, వాటితో చేతులను శుభ్రపరచుకున్న తరువాత, చేతులకు గ్లవ్స్ వేసుకుని ఓటు వేసి రావాలని ఆదేశించారు.

క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నామని దక్షిణ కొరియా ఎలక్షన్ కమిషన్ చైర్మన్ కోన్ సూన్-లీ వెల్లడించారు. దేశానికి యజమానులైన ప్రతి ఓటరూ విధిగా పోలింగ్ బూత్ కు వెళ్లి తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. కాగా, ఈ ఉదయం దేశంలో పోలింగ్ ప్రారంభమైంది.


More Telugu News