కరోనాతో చెన్నైలో మరణించిన ఏపీ డాక్టర్... ఓ శ్మశానంలో అడ్డుకోవడంతో, రహస్యంగా అంత్యక్రియలు!

  • న్యూఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన డాక్టర్
  • అంబత్తూరు శ్మశాన వాటికలో అడ్డుకున్న స్థానికులు
  • మరో ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు
న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరై వచ్చిన నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్, కరోనా సోకి, చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని అంత్యక్రియలను అధికారులు రహస్యంగా ముగించాల్సి వచ్చింది. 56 సంవత్సరాల ఈ వైద్యుడికి బీపీ కూడా ఉండటంతో, పరిస్థితి విషమించి, సోమవారం నాడు మరణించారు. తొలుత అంబత్తూరు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించిన అధికారులు, మృతదేహాన్ని అక్కడికి తరలించిన వేళ, స్థానికుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

అక్కడ అంత్యక్రియలను నిర్వహిస్తే, వైరస్ వ్యాపిస్తుందన్న ఆందోళనలో ఉన్న ప్రజలను సమాధానపరచలేక పోయిన అధికారులు, మృతదేహాన్ని తిరిగి ఆసుపత్రి మార్చురీకే తరలించారు. ఆపై అతని మృతదేహాన్ని మరో శ్మశాన వాటికకు తీసుకెళ్లి రహస్యంగా అంత్యక్రియలు ముగించారు. కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో పాటించాల్సిన విధానాలన్నీ పాటించామని, అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామని తెలిపారు.

"ఇది చాలా సున్నితమైన విషయం. ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ అంత్యక్రియల విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్ గురించి తెలుసు. ఈ మేరకు అన్ని ఆసుపత్రులకూ విధివిధానాలను కూడా అందించాం. గతంలో ఎన్నడూ ఇలా జరుగలేదు" అని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ వ్యాఖ్యానించారు.


More Telugu News