మార్చి 26, 2020.. తెలంగాణలో ఒక్క రోడ్డు ప్రమాదమూ జరగని రోజుగా రికార్డు!

  • లాక్ డౌన్ వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గింది 
  • సగటు మరణాల సంఖ్య కనిష్ఠానికి
  • వెల్లడించిన రహదారి భద్రతా విభాగం రిపోర్టు
మార్చి 26, 2020...!
తెలంగాణ చరిత్రలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత మిగిలిపోయింది. ఆ రోజు రాష్ట్రంలో ఒక్క రోడ్డు ప్రమాద మరణమూ సంభవించలేదు. తాజాగా, గణాంకాలను వెల్లడించిన రోడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఇది ఒక రికార్డని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధించిన సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు తగ్గాయని గుర్తు చేసిన అధికారులు, మార్చి నెలలో 26వ తేదీన మాత్రం ఒక్క మరణమూ సంభవించలేదన్నారు.

కాగా, లాక్ డౌన్ కారణంగా రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో, ప్రమాదాల సంఖ్య కూడా కనిష్ఠానికి పడిపోయింది. రహదారి భద్రతా విభాగం రిపోర్టు ప్రకారం, తెలంగాణలో సగటున రోజుకు 60 ప్రమాదాలు జరుగుతూ ఉండగా, 19 మరణాలు, 80 మందికి గాయాలూ అవుతూ ఉండేవి. గత సంవత్సరం అయితే 6,964 మరణాలు సంభవించాయి.

ఇక ఈ మార్చిలో 22 నుంచి 31 వరకూ రోడ్డు ప్రమాదాల్లో 52 మంది మరణించారు. ఏప్రిల్ లో 7వ తేదీ వరకూ 23 మంది చనిపోయారు. సాధారణ సగటుతో పోలిస్తే, మరణాల సంఖ్య 4కు పడిపోయిందని అధికారులు అంటున్నారు. ఇవి కూడా మితిమీరిన వేగంతో జరిగినవేనని అన్నారు.


More Telugu News