స్పెయిన్ లో తనకు ఎదురైన కరోనా అనుభవాలను పంచుకున్న హీరోయిన్ శ్రియ!

  • స్పెయిన్ లో చిక్కుకుపోయిన శ్రియ దంపతులు
  • మార్చి 13 నుంచి పరిస్థితి తల్లకిందులైంది
  • ఇంట్లో సరకులు అయిపోతున్నాయన్న శ్రియ
  • మహమ్మారి నశిస్తే, మెరుగైన ప్రపంచాన్ని చూడవచ్చని వ్యాఖ్య
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న స్పెయిన్ లో హీరోయిన్ శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొశ్చీవ్ చిక్కుకుపోగా, ఆండ్రూలో కరోనా లక్షణాలు కనిపించాయంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రియ, తన భర్త పరిస్థితి, స్పెయిన్ లో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఎంతో త్వరగా, కరోనా వైరస్ ప్రజల జీవితాలను తల్లకిందులు చేసిందని వ్యాఖ్యానించింది.

కొన్ని వారాల ముందు పరిస్థితి ఇలా లేదని, మార్చి 13 నుంచి మొత్తం మారిపోయిందని చెప్పింది. తమ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, ముందుగానే ఓ రెస్టారెంట్ లో రిజర్వేషన్ చేయించుకుని, అక్కడికి వెళ్లామని, అది మూసేసి వుందని, అప్పటికే స్పెయిన్ లో లాక్ డౌన్ ను ప్రకటించారని, ఆ రోజు నుంచే పరిస్థితులన్నీ మారిపోయాయని తెలిపింది. ఎవరూ బయట తిరగవద్దని, తప్పనిసరైతేనే రావాలని పోలీసుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పుకొచ్చింది.

ఓసారి, ఆండ్రూ, తాను కలసి బయటకు వెళ్లామని, ఆండ్రూ శరీర రంగు, తన శరీర రంగు వేరు కావడంతో, తామిద్దరమూ కలిసే వచ్చామని తెలుసుకోని పోలీసులు, ఇద్దరినీ వదిలేశారని, ఆపై కొన్ని రోజులకే తన భర్తకు పొడిదగ్గు, జ్వరం వచ్చాయని, ఆసుపత్రికి వెళితే, ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని డాక్టర్లు బతిమాలారని, ఆసుపత్రిలో చేరితే, అక్కడి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పడంతో, ఇంటికే వచ్చేసి, సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నామని, వేర్వేరు గదుల్లో నిద్రించామని చెప్పింది.

ప్రస్తుతం దేశంలో పరిస్థితి మెరుగుపడుతోందని, తాను ఇండియాను మిస్ అవుతున్నానని వాపోయిన శ్రియ, తన తల్లి వీడియో కాల్ లో చేసిన సూచనలతో వంట ఎలా వండాలో నేర్చుకున్నానని, ఇప్పుడు సరకులు కూడా అయిపోతున్నాయని చెప్పింది. కరోనా విజృంభించిన సమయంలో వేలాది మంది పడుతున్న కష్టాలతో పోలిస్తే, తన కష్టం తక్కువేనని వ్యాఖ్యానించింది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని వదిలేసిన తరువాత, మెరుగైన ప్రపంచం మన ముందుంటుందని అభిప్రాయపడింది.


More Telugu News