కరోనా వైరస్ గొలుసు తెంచడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు మరిన్ని చర్యలు!

  • ఒక కేసు వస్తే, చుట్టూ 100 ఇళ్లతో ప్రత్యేక జోన్
  • ఒక కేసుకు మించితే, చుట్టూ 250 మీటర్ల పరిధిలో జోన్
  • నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్న అధికారులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం, వైరస్ గొలుసును తెగగొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు మరిన్ని కఠిన చర్యలను ప్రకటించింది. ఏదైనా పాజిటివ్ కేసు వచ్చిన చోట ఆ ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్లతో కంటైన్ మెంట్ జోన్ లను ప్రకటించింది. ఆ జోన్ లోపలికి వెళ్లే అన్ని రహదారులనూ పూర్తిగా మూసివేయాలని, ఒకే దారి తెరచి, 24 గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీ లేదా అపార్టు మెంట్ లో కరోనా బయటపడితే, వాటి పరిధి వరకూ కంటైన్ మెంట్ జోన్ ను ప్రకటించాలని పేర్కొంది.

ఇక ఒకటి కన్నా ఎక్కువ కేసులు నమోదైతే, కనీసం 250 మీటర్ల పరిధిలో జోన్ ఉండాలని, అక్కడికి వెళ్లే మార్గాలను 8 అడుగుల ఎత్తున్న బారికేడ్లతో మూసివేయాలని, సరైన కారణం లేకుండా జోన్ లోపలికి ఎవరినీ వెళ్లనివ్వరాదని, జోన్ నుంచి ఎవరూ బయటకు రాకుండా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక్కడి ప్రజలను ఇళ్లు దాటి కనీసం, ఇంటిముందుండే ఫుట్ పాత్ లపైకి కూడా అనుమతించబోమని, ప్రతి ఒక్కరి రాకపోకలనూ రికార్డు చేయాలని తన ఉత్తర్వుల్లో అరవింద్ కుమార్ ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సరకులను, పాలు, కూరగాయలు తదితరాలను నిత్యమూ 12 గంటల్లోగా ఇళ్ల వద్దకే పంపుతామని తెలిపారు. ప్రతి జోన్ కూ ఓ నోడల్ అధికారిని ప్రకటించాలని, అతని ఫోన్ నంబర్ ను ప్రతి ఇంటికీ అందించాలని సూచించారు.

ఇక ఈ జోన్ ల పరిధిలో ఉన్న అనాధలను గుర్తించి, వారిని షెల్టర్ హోమ్స్ కు తరలించి, వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించాలని, ఓ కుటుంబానికి చెందిన అందరినీ ఒకే చోటకు చేర్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ ఈ ప్రాంతంలోని ఎవరిలోనైనా, వైరస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేస్తారు. వైరస్ సోకితే అక్కడే ఉంచాలని, నెగటివ్ వస్తే, హోమ్ క్వారంటైన్ చేయాలని ఆదేశించారు.


More Telugu News