అంబేద్కర్ జయంతి వేళ.. కేసీఆర్ నాడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన విజయశాంతి!

  • బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన కాంగ్రెస్ నేత
  • దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఏమై పోయాయని ప్రశ్న
  • లాక్‌డౌన్‌ పొడిగింపును సమర్థించిన విజయశాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తాజాగా గుర్తు చేశారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ పేజీలో నాటి వీడియోను పోస్టు చేశారు. ఇందులోని కేసీఆర్ మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. అందులో కేసీఆర్ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై ఉన్న బుద్ధుడి విగ్రహం వెనక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ వెనక సెక్రటేరియట్ ఉంటుందని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తులో ఉంటుందని అన్నారు.  

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ వీడియోను పోస్టు చేసిన విజయశాంతి.. దళిత ముఖ్యమంత్రి ఎక్కడని ప్రశ్నించారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైపోయిందని నిలదీశారు. దళిత ఉప ముఖ్యమంత్రుల జాడ కూడా లేదన్నారు. ఎప్పుడో తాను చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని అంబేద్కర్ వచ్చి విగ్రహం ఏదని అడుగుతారా? భవనం ఏదని ప్రశ్నిస్తారా? అని కేసీఆర్ దొరగారు భావిస్తున్నట్టు ఉందని విజయశాంతి అన్నారు. కాగా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని విజయశాంతి సమర్థించారు.


More Telugu News