కరోనా కట్టడి కోసం 'ఇంటెలిజెంట్ లాక్ డౌన్' అమలు చేస్తున్న నెదర్లాండ్స్

  • కొన్ని ప్రదేశాల్లోనే పూర్తి లాక్ డౌన్
  • ప్రజల్లో చైతన్యం కోసం తీవ్రస్థాయిలో ప్రచారం
  • ఇతర యూరప్ దేశాలతో పోల్చితే తక్కువ ప్రాణనష్టం
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి గురైన దేశాల్లో నెదర్లాండ్స్ కూడా ఒకటి. ఈ యూరప్ దేశంలో ఇప్పటివరకు 27,419 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,945 మంది మరణించారు. అయితే ఇతర యూరప్ దేశాలైన ఇటలీ, స్పెయిన్ కంటే ఇక్కడ తక్కువ జననష్టం జరిగిందనే చెప్పుకోవాలి. నెదర్లాండ్స్ లో కరోనా ఉనికి ప్రారంభమైన క్షణం నుంచి ఇంటెలిజెంట్ లాక్ డౌన్ విధానం అమలు చేస్తున్నారు. ఇది సంపూర్ణ లాక్ డౌన్ కాదు. ఎక్కడ ప్రజలు నేరుగా ఒకరిని ఒకరు తాకే అవకాశం ఉందో అక్కడ మాత్రం లాక్ డౌన్ విధించారు.

సెలూన్లు, రెడ్ లైట్ ఏరియాలను మూసేశారు. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించారు. పూల దుకాణాలు, బేకరీలు, టాయ్ షాపులు, ఇనుము దుకాణాలు వంటివి తెరిచే ఉంచారు. ఈ దుకాణాల వద్ద భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. తెరిచి ఉంచిన దుకాణాల వద్దకు వచ్చే ప్రజలు అక్కడి పోస్టర్లు, నేలమీద వేసిన గుర్తులు చూసి కరోనా పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. దుకాణదారులు కూడా గ్లోవ్స్, మాస్కులు ధరించి వ్యాపారాలు చేసుకుంటుండడంతో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది.

ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఒకరి నుంచి ఒకరు ఐదు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, నెదర్లాండ్స్ జనాభా 1.72 కోట్లు మాత్రమే కావడంతో ఆ లెక్కన చూస్తే కరోనా మరణాల రేటు అధికంగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News