రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే అరవై శాతం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోగలుగుతాం: సీఎం జగన్

  • సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ 
  • రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి
  • నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు
  • కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా నిర్వహించాలి
లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తే అరవై శాతం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోగలుగుతామని  ఏపీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన మాట్లాడారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదని కలెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ అత్యంత ప్రాధాన్యతాంశాలని, ఇవి జూన్ నుంచి  పనిచేయాలని ఆదేశించారు.

నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని, రెండు రోజులకొకసారి నిత్యావసర సరుకుల ధరలను ప్రకటించాలని ఆదేశించారు. ఒక రేషన్ దుకాణం పరిధిలో రెండు, మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రేషన్ సరుకుల కోసం వచ్చే వారు గుమికూడకుండా ఉండే నిమిత్తం టోకెన్ల విధానం పాటించాలని సూచించారు. రేషన్ తీసుకున్న ప్రతిఒక్కరికీ రూ.1000 చొప్పున ఇవ్వాలని మరోమారు స్పష్టం చేశారు.

కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా నిర్వహించాలని, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కనిపించినా వెంటనే వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్లలో వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అదే విధంగా జిల్లాలో ఉన్న షెల్టర్ జోన్లలో సౌకర్యాలపై దృష్టిసారించాలని సూచించారు.


More Telugu News