నా రీఎంట్రీపై అభిమానుల్లో లేనిపోని ఆశలు కల్పించను: ఏబీ డివిలియర్స్

  • టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండేది లేనిదీ ఇప్పుడే చెప్పలేను
  • వంద శాతం ఫిట్‌గా ఉంటేనే రేసులోకి వస్తా
  • ప్రాతినిధ్యం కోసం కాకుండా.. దేశం కోసం శ్రమిస్తానని ఏబీ వెల్లడి 
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రిటైర్మెంట్‌పై నిర్ణయం వెనక్కు తీసుకొని తిరిగి మైదానంలోకి రావాలని అతని సహచరులు, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై ఒక దశలో ఏబీ సానుకూలంగా స్పందించాడు.

అయితే, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉండే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేనని డివిలియర్స్‌ అంటున్నాడు. రీఎంట్రీ విషయంలో అభిమానులకు లేనిపోని ఆశలు కల్పించనని స్పష్టం చేశాడు. జట్టులో చోటు కోసం పోటీ పడే వారికంటే తాను మెరుగ్గా ఉంటేనే అవకాశం కోసం ప్రయత్నిస్తానన్నాడు. కేవలం ప్రాతినిధ్యం వహించాలనే ఆశ కంటే.. దేశం కోసం శ్రమించాలనే తపనతోనే పోరాడుతానన్నాడు.  

‘వరల్డ్‌కప్‌కు ఇంకా ఆరు నెలల టైమ్‌ ఉంది. అప్పటికీ వైరస్‌ వ్యాప్తి తగ్గకపోతే టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చు. అదే జరిగితే చాలా విషయాలు మారిపోతాయి. అప్పటికి నా శరీర పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు.  ప్రస్తుతానికైతే పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌నెస్‌తో ఉన్నా. టీమ్‌కు సేవలందిస్తానని  చెప్పొచ్చు. కానీ ఇలా చెప్పేందుకు నా మనసు అంగీకరించడం లేదు’ అని ఏబీ చెప్పుకొచ్చాడు. వంద  శాతం ఫిట్‌గా ఉంటే ఆడతానని,  80 శాతం ఉన్నా ఆడని స్పష్టం చేశాడు.  అందుకే రీ ఎంట్రీ విషయంలో లేనిపోని ఆశలు కల్పిస్తూ తప్పుడు సంకేతాలు ఇవ్వదల్చుకోలేదని ఏబీ వెల్లడించాడు.


More Telugu News