ఐపీఎల్ మరికొంతకాలం వాయిదా.. బీసీసీఐ యోచన!

  • లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో బీసీసీఐ యోచన
  • ఈ నెల 15వ తేదీకి వాయిదా పడ్డ మెగా లీగ్
  •  నిరవధికంగా వాయిదా వేసే అవకాశం
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. మార్చి 29న మొదలవ్వాల్సిన లీగ్ ఈ నెల 15కు వాయిదా పడింది. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రం మోదీ ప్రకటించడంతో  ఐపీఎల్‌ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రం ప్రకటన నేపథ్యంలో లీగ్‌ను మరికొంతకాలం వాయిదా వేయాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి ఐపీఎల్‌ పదమూడో సీజన్ భవితవ్యంపై సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్లు కాన్ఫరెన్స్‌ కాల్‌లో చర్చించాల్సి ఉంది. అయితే, లాక్‌డౌన్‌ పై  ప్రధాని జాతిని ఉద్దేశించే ప్రసంగం ఈ రోజుకు వాయిదా పడడంతో ఈ సమావేశాన్ని బీసీసీఐ విరమించుకుంది. లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే  తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో రేపు కొన్ని మార్గనిర్దేశకాలు ప్రకటిస్తామని మోదీ తెలిపారు. అవి వెలువడిన తర్వాత  ఐపీఎల్‌పై బోర్డు నిర్ణయానికి వచ్చే చాన్సుంది. దేశంలో పరిస్థితులు మెరుగయ్యే వరకూ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది.


More Telugu News