నరేంద్ర మోదీ ప్రసంగంపై ప్రముఖుల అభిప్రాయాలు ఇవి!

  • కొత్త హాట్ స్పాట్ కేంద్రాలు పుట్టకుండా జాగ్రత్త పడాలన్న నిర్మలా సీతారామన్
  • ప్రజల అవసరాలను తీర్చే నిర్ణయాలు ఎక్కడున్నాయన్న శశి థరూర్
  • లక్షల మంది పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ప్రశాంత్ భూషణ్
  • కఠిన నిర్ణయమే అయినా, సరైనదేనన్న పవన్ గోయంకా
ఇండియాలో మే 3 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని, నిబంధనల సడలింపుపై 20వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దాదాపు 25 నిమిషాల పాటు మోదీ మాట్లాడగా, దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు.

"కొత్త కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు పుట్టకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులూ ఎంత జాగ్రత్తగా ఉన్నామో, అంతే జాగ్రత్తగా ఉండాలి" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

"ప్రధాని ప్రకటించిన లాక్ డౌన్ పొడిగింపునకు మద్దతిస్తున్నాను. దీనివల్ల ప్రయోజనం ఉంది. ఇదే సమయంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు కూడా కొన్ని నిర్ణయాలు ప్రకటించివుంటే బాగుండేది. ఎంఎన్ఆర్ఈజీఏ చెల్లింపులు, జన్ ధన్ ఖాతాలు, రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపులు తదితరాలను మరచిపోయారు" అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు.

"ఎవరి డ్యూటీని వారు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మేము నిబంధనలన్నీ పాటిస్తాం. మాస్క్ లు ధరిస్తాం. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాం. ఆరోగ్య యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటాం. పేదలవైపు చూడండి. ఉద్యోగులపై ఆగ్రహాన్ని చూపకండి. నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి. ఎంఎస్ఎంఈలకు సహకారాన్ని అందించాలి" అని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

"మే 3 వరకూ లాక్ డౌన్ ను పొడిగించినంత వరకూ సరే. లక్షలాది మంది పేదలు, నిరాశ్రయుల పరిస్థితి ఏంటి?. కొన్ని చోట్ల వీధి కుక్కలతో కలిసి రోడ్డుపై పడ్డ పాలను ఎత్తుకుంటున్న కడు పేదల దృశ్యాలు కనిపించ లేదా?" అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. తాజాగా వైరల్ అయిన ఆగ్రా వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

"లాక్ డౌన్ పొడిగింపు కఠిన నిర్ణయమేనని నేను కచ్ఛితంగా చెప్పగలను. ఇదే సమయంలో సరైన నిర్ణయమేనని నేను నమ్ముతున్నాను. ఇక, ఈ లాక్ డౌన్ ను మరోసారి పొడిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత జాతి ప్రజలందరిపైనా ఉంది. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలంతా పాటించాలి. సురక్షితంగా ఉండాలి" అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయంకా వ్యాఖ్యానించారు.


More Telugu News