నరేంద్ర మోదీ లాక్ డౌన్ పై కొత్తగా ఏం చెప్పారో నాకైతే అర్థం కాలేదు: కాంగ్రెస్ నేత చిదంబరం సెటైర్

  • పేదల జీవనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు
  • ముఖ్యమంత్రుల ఆర్థిక సాయం వినతిపై మాట్లాడలేదు
  • ఎంతో మంది సలహాలను పట్టించుకోలేదన్న చిదంబరం
కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడం ఒక్కటే మార్గమన్న విషయం అందరికీ తెలిసిందేనని, నరేంద్ర మోదీ తన ప్రసంగంలో, కొత్తగా ఏం చెప్పారో తనకు అర్థం కాలేదని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన ఆయన, లాక్ డౌన్ పొడిగింపును తాను సమర్థిస్తున్నానని, ఇదే సమయంలో నిరాశ్రయులై, రోడ్డున పడ్డ పేదల గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని మరోసారి స్పష్టమైందని విమర్శలు గుప్పించారు.

"లాక్‌ డౌన్‌ కొనసాగింపును పక్కన పెడితే... ప్రధాని నూతన సంవత్సర సందేశంలో కొత్త అంశం ఏముంది?. పేదల జీవనం, వాళ్ల మనుగడకి ప్రాధాన్యత లేదని మరోసారి రుజువైంది" అని చిదంబరం విమర్శించారు. ఆపై "ముఖ్యమంత్రులు కోరిన ఆర్థిక సహాయం గురించి నరేంద్ర మోదీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి జత చేయలేదు. రఘురామ్ రాజన్  నుంచి జీన్ డ్రేజ్ వరకూ, ప్రభాత్  పట్నాయక్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకూ... ఎంతో మంది ఇచ్చిన సలహాలు, చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు అయిపోయాయి" అన్నారు.

దాని తరువాత "గడచిన 21 రోజులే కాకుండా మరో 19 రోజుల పాటు పేదలు తమ ఆహారం కోసం అభ్యర్థించాల్సిందే. తమను తాము రక్షించుకునేందుకు అవస్థలు పడక తప్పదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆహారం ఉంది. కానీ, ఆ రెండిటిని ప్రభుత్వం విడుదల చేయదు" అని వ్యాఖ్యానించారు.


More Telugu News