అభిమాని నాగలక్ష్మితో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన చిరంజీవి దంపతులు!

  • అంజనా సేవా సంస్థకు అధ్యక్షురాలిగా నాగలక్ష్మి
  • ఆమె గుండె ఆపరేషన్‌కు సాయం చేసిన చిరంజీవి
  • ఈ జన్మకు ఇది చాలన్న అభిమాని
గుండె ఆపరేషన్ చేయించుకున్న గుంటూరు జిల్లాకు చెందిన తన అభిమాని, అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలు రాజనాల నాగలక్ష్మితో మెగాస్టార్ చిరంజీవి దంపతులు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వయంగా వెళ్లి కలిసే వీలు లేకపోవడంతో చిరంజీవి ఇలా వీడియో కాల్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచారు.

గుండె జబ్బుతో బాధపడుతున్న నాగలక్ష్మి ఆరోగ్యం ఇటీవల క్షీణించింది. దీంతో అభిమానులు ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రత్యేక అనుమతితో ఆమెను గుంటూరు నుంచి హైదరాబాద్ తరలించారు. విజయవంతంగా ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు  నిన్న ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, సురేఖ దంపతులు వీడియో కాల్ ద్వారా నాగలక్ష్మితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చిరంజీవి స్వయంగా కాల్ చేయడంతో నాగలక్ష్మి సంతోషం పట్టలేకపోయారు. ఇది తనకు దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. సురేఖ గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ జన్మకి ఈ అదృష్టం చాలని పేర్కొన్న నాగలక్ష్మి.. చిరంజీవి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.


More Telugu News