గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి కరోనా.. రహస్యంగా కలిసొచ్చిన అల్లుడిపై కేసు!

  • అనారోగ్యంతో మామ గుంటూరు ఆసుపత్రిలో చేరిక  
  • చీరాల నుంచి గుంటూరు వచ్చిన అల్లుడు
  • కుటుంబ సభ్యులందరికీ క్వారంటైన్
కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే విషయం తెలిసిన అతడి అల్లుడు రహస్యంగా వెళ్లి పరామర్శించాడు. అంతేకాదు, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆసుపత్రి వద్ద ఉన్న తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి స్వగ్రామం చేరుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ప్రకాశం జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడిని ఇటీవల సూర్యాపేట జిల్లా మిట్టపల్లిలోని తన మామగారింటికి పంపాడు. ఇటీవల మామ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది.

విషయం తెలిసిన రామకృష్ణాపురంలోని అల్లుడు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చీరాల నుంచి గుంటూరు వెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామను రహస్యంగా కలిసి పరామర్శించాడు. అనంతరం అక్కడే ఉన్న తన కుమారుడిని తీసుకుని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. తాను గుంటూరు వెళ్లి కరోనా రోగిని కలిసి వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ చేశారు.


More Telugu News