ప్రధానికి మరో లేఖ రాసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా

  • ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ నిర్ణయం పట్ల హర్షం
  • ఈ పథకాన్ని సెప్టెంబరు వరకు కొనసాగించాలని సూచన
  • రేషన్ కార్డులు లేనివారికి 10 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలని విజ్ఞప్తి
కరోనా నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పేదలకు చేయూతనిచ్చే ఉచిత సరఫరా పథకం బాగుందని ప్రశంసించారు. ఈ పథకాన్ని సెప్టెంబరు వరకు కొనసాగించాలని ప్రధానిని కోరారు.

రేషన్ కార్డులు లేనివారికి కూడా 10 కిలోల ఆహార ధాన్యాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా కూలీల వద్ద ఆహార భద్రత కార్డులు ఉండే అవకాశం లేదని, వారికి కూడా ఆహారధాన్యాలు అందేలా చూడాలని సూచించారు. ఆహార ద్రవ్యోల్బణం రాకుండా చూసేందుకే ఈ సూచనలు చేశామని సోనియా తన లేఖలో వివరించారు.

రవాణా సమస్యలు ధరల పెరుగుదలకు కారణం కాకుండా చూడాలని, ఆహార పదార్థాలను రాష్ట్రాలకు విరివిగా అందించాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయాల్లో ఉపయుక్తంగా ఉండేందుకు ఎఫ్ సీఐ నిల్వ సామర్థ్యం పెంపొందించే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


More Telugu News