కరోనా కట్టడికి ఏపీలో మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

  • డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమం ప్రారంభం
  • ఔషధాల పంపిణీ అమలు
  • టోల్‌ ఫ్రీ నెంబరు 14410 ఏర్పాటు
  • 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌  సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమం పేరిట ఔషధాల పంపిణీ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబరు 14410 ప్రారంభించారు. ఇందులో స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఇప్పటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ ముందుకు వచ్చారని ప్రభుత్వం తెలిపింది.

 ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తారని చెప్పింది. ఈ టోల్ ఫ్రీ నంబరు 14410కు ఫోన్ చేసిన జగన్‌ డాక్టర్‌తో మాట్లాడారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులను గుర్తించి, బాధితులను ఐసొలేషన్‌కు తరలిస్తారు. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు తీసుకోవచ్చు.

14410 టోల్‌ ఫ్రీ నంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో వైద్యులు రోగుల వ్యాధి లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారని, రోగికి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తారన్నారు.

అవసరమైతే బాధితులను ఏ ఆసుపత్రికి పంపించాలన్న వివరాలు కూడా చెబుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వాలంటీర్లు నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు.


More Telugu News