లాక్‌డౌన్‌లో చిన్నారులపై పెరిగిన వేధింపులు.. విషయం సుప్రీం దృష్టికి!

  • సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఇద్దరు లాయర్ల లేఖ
  • లేఖనే సుమోటాగా తీసుకోవాలని వినతి
  • వేధింపులు అరికట్టేలా అధికారులను అదేశించాలని విజ్క్షప్తి
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. ప్రజలను వైరస్‌ బారి నుంచి రక్షించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నాయి. కానీ, ఈ సమయంలో చిన్నారులపై వేధింపులు పెరిగాయని సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయ స్థానం దృష్టికి తీసుకొచ్చారు.

చిన్నారులపై వేధింపులను అరికట్టాలని కోరుతూ న్యాయవాదులు సుమీర్ సోధీ ఆర్జూ అనేజా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. ఈ లేఖనే సుమోటాగా స్వీకరించాలని కోరారు. వేధింపులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌లో మొత్తం నేరాల రేటు తగ్గినప్పటికీ.. చిన్నారులపై వేధింపులు మాత్రం పెరిగాయని తెలిపారు.

లాక్‌డౌన్‌ సమయంలో తమను ఆదుకోవాలని చిన్నారుల నుంచి హెల్ప్ లైన్ సెంటర్లకు 92 వేల ఫోన్ కాల్స్ వచ్చినట్టు ఒక పత్రిక కథనం ప్రచురించిందని, దాన్ని ఆధారంగా చేసుకొని తాము లేఖ రాస్తున్నట్టు చెప్పారు. మరెంతో మంది చిన్నారులు బయటికి వచ్చి.. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందువల్ల వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు.


More Telugu News