సముద్రంలో పెరిగే ఈ నాచుతో కరోనాను కట్టడి చేయొచ్చు: రిలయన్స్ రీసర్చ్

  • పొర్ఫీరీడియం సల్ఫేెటెడ్ నాచుకు ఇన్ఫెక్షన్ ను నివారించే శక్తి
  • అధ్యయన పత్రాన్ని విడుదల చేసిన రిలయన్స్ ఆర్ అండ్ డీ సెంటర్
  • యాంటీ వైరల్ ఔషధాలను తయారు చేయవచ్చని వెల్లడి
ఇప్పుడు యావత్ ప్రపంచం ముందు ఉన్న పెను సవాలు కరోనా వైరస్ కు మందు కనుక్కోవడమే. ఈ మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎప్పటిలోగా వ్యాక్సిన్ ను కనుక్కుంటారనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ కీలక విషయాన్ని కనిపెట్టారు. సముద్రాల్లో ఉండే పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచుకు కరోనా ఇన్ఫెక్షన్లను నివారించే శక్తి ఉందని గుర్తించారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాకరైడ్ లు శ్వాసకోస సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్ లకు బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా పని చేస్తాయని కనిపెట్టారు.

దీనికి సంబంధించి రిలయన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఓ అధ్యయన పత్రాన్నివిడుదల చేసింది. ఈ నాచుతో యాంటీ వైరల్ ఔషధాలతో పాటు శానిటరీ ఉపకరణాలపై యాంటీ వైరల్ కోటింగ్ వేయవచ్చని అధ్యయన పత్రంలో వెల్లడించింది. మరోవైపు కారోనా నిర్ధారణ పరీక్షల కిట్ల అభివృద్ధిపై కూడా రిలయన్స్ దృష్టి సారించింది.


More Telugu News