28 మందికి పాజిటివ్.. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీ క్యాన్సర్ ఆసుపత్రి

  • యూకే నుంచి సోదరుడితో వైద్యురాలికి  కరోనా
  • ఆమె నుంచి ఆసుపత్రిలో ఇతరులకు సోకిన వైరస్‌
  • తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌
ఢిల్లీలోని ఓ ఆసుపత్రి కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారింది. అక్కడి నుంచి ఇప్పటికే 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్న ఓ వైద్యురాలి నుంచి ఇతర డాక్టర్లు, రోగులకు వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది.  యూకే నుంచి వచ్చిన తన సోదరుడు, అతని భార్య వల్ల ఆమెకు కరోనా వచ్చింది.

అయితే, ఈ విషయం తెలియక ఆమె చాలా మందిని కలిశారు. పలువురు క్యాన్సర్ రోగులకు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆ వైద్యురాలు వైరస్ వాహకంగా మారారు. దాంతో,  ఆమె కుటుంబ సభ్యులు సహా ఇప్పటికే 28 మందికి కరోనా సోకింది. ఇందులో ముగ్గురు క్యాన్సర్ పేషెంట్లు, ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు.  

తాజాగా ఆ ఆసుపత్రికి చెందిన మరో ముగ్గురిలో వైరస్ గుర్తించారు ఇందులో ఒక క్యాన్సర్ రోగి, ఈ వ్యక్తి కుటుంబ సభ్యుడు, ఓ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఈ ఆసుపత్రిని ఈ నెల 1వ తేదీనే మూసివేశారు. అందులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, కాన్సర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అందువల్ల వారికి కరోనా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 1154 మందికి వైరస్ సోకగా, 24 మంది మరణించారు.


More Telugu News