హెచ్ డీ ఎఫ్ సీలో 1.75 కోట్ల షేర్లను చేజిక్కించుకున్న చైనా బ్యాంకు

  • కంపెనీలో 1.1 శాతానికి పెరిగిన చైనా బ్యాంకు వాటా
  • ఇటీవల కాలంలో పతనమైన హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ వాల్యూ
  • ఫిబ్రవరి మొదటి వారం నుంచి 41 శాతం క్షీణత
ప్రపంచ ఆర్థిక రంగంలో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఓవైపు కరోనా రక్కసి ఆర్థిక వ్యవస్థలను సైతం కూలదోస్తున్న తరుణంలో, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక ముందడుగు వేసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. మార్చి త్రైమాసికంలో ఈ కొనుగోలు ప్రక్రియ జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ల విలువ క్రమంగా పతనమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు 41 శాతం క్షీణత చవిచూసింది.

అంతకుముందు జనవరి 14న 52 వారాల గరిష్ట పతనంతో హెచ్ డీఎఫ్ సీ షేర్ రూ.2,499.65 వద్ద ట్రేడయింది. ఏప్రిల్ 10 నాటికి హెచ్ డీఎఫ్ సీ షేర్ వాల్యూ రూ.1,710కి పడిపోయింది. అదే సమయంలో భారత సూచీల్లో సెన్సెక్స్ 25 శాతం నష్టపోగా, నిఫ్టీ 26 శాతం నష్టాలు చవిచూసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా వాటాదారు కాగా, డిసెంబరు త్రైమాసికంలో తన వాటాను 4.21 శాతం నుంచి 4.67 శాతానికి పెంచుకుంది.

ఇక, తాజా లావాదేవీపై హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వైస్ చైర్మన్, సీఈఓ కెకీ మిస్త్రీ మాట్లాడుతూ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు తమ కంపెనీలో 2019 మార్చి నాటికే 0.8 శాతం వాటాలున్నాయని వెల్లడించారు. ఇప్పుడా వాటాలు ఒక్క శాతాన్ని దాటాయని, ప్రస్తుతానికి హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా 1.1 శాతం అని వివరించారు.

గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చైనా ప్రపంచ ప్రధాన ఆర్థిక సంస్థల్లో భారీగా వాటాలు దక్కించుకుంటోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాగిస్తున్న చైనా ఇతర ఆసియా దేశాల్లో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ, టెక్నాలజీ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది.


More Telugu News