ఇవన్నీ ఏపీ గవర్నర్ ఎలా చూస్తూ ఊరుకున్నారు? : టీడీపీ నేత సోమిరెడ్డి
- ఎస్ఈసీ నియామక నిబంధన ప్రకారం వయసు 65 ఏళ్ల దాటకూటదు
- ఆ పదవిలోకి 84 ఏళ్ల కనగరాజ్ ను చెన్నై నుంచి తీసుకొచ్చారు!
- ఇవన్నీ గవర్నర్ ఎలా చూస్తూ ఊరుకున్నారు?
- గవర్నర్ కు ఏమైనా బెదిరింపులు ఉన్నాయా?
ఏపీలో కొత్త జీవో ప్రకారం తన పదవిని కోల్పోయిన ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఈసీ నియామక నిబంధన ప్రకారం వయసు 65 ఏళ్ల దాటకూటదని ఉంటే రమేశ్ కుమార్ ని ఆ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో పని చేసేందుకు 84 ఏళ్ల కనగరాజ్ ను చెన్నై నుంచి తీసుకొచ్చి నియమించారని విమర్శించారు. ఇవన్నీ గవర్నర్ ఎలా చూస్తూ ఊరుకున్నారు? గవర్నర్ కు ఏమైనా బెదిరింపులు ఉన్నాయా? సీఎం ఇంత ఘోరమైన నిర్ణయాన్ని తీసుకుంటే గవర్నర్ కళ్లు మూసుకుని ఎందుకు సంతకం చేయడం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రమేశ్ కుమార్ తొలగింపును కనీసం గంట సేపు కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆపలేకపోయారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్న గవర్నర్ మంచి నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని విమర్శించారు. ప్రజల సందేహాన్ని నివృతి చేయాల్సిన అవసరం గవర్నర్ పై ఉందని అన్నారు. కరోనా’ కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రమేశ్ కుమార్ నాడు వాయిదా వేయడం ద్వారా ఆ మహమ్మారి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడారని, ఆయన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించిందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి లోబడే పరిపాలించాలన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు.