ఏపీలో లాక్‌డౌన్‌ను సడలించాలని అనుకుంటున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

  • కొన్ని ప్రాంతాలకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలనుకుంటున్నారు
  • లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిందే
  • ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పొడిగించారు
  • మనుషుల ప్రాణాలే అన్నింటి కన్నా ముఖ్యం
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఎటువంటి ప్రకటన రాలేదు. ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలంటూ  బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా  లక్ష్మీనారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు కొనసాగించాలని  కన్నా  లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఏపీలో లాక్‌డౌన్‌ను సడలించడం లేక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసే దిశగా జగన్ ప్రభుత్వం యోచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకు క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి తీసుకుంటున్న చర్యలను ఇప్పటికే చాలా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభినందించాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల జీవన పరిస్థితులతో పాటు ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా చూడాల్సిన ఉన్నప్పటికీ అన్నింటికంటే మనుషుల ప్రాణాలే ముఖ్యమని అన్నారు.

ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఒడిశా లాంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్‌ను పొడిగించి, దీనిపై ఎలాంటి సడలింపులు ఇవ్వద్దని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.


More Telugu News