గుంపులు గుంపులుగా జనం.. పోలీసులతో గొడవ పడుతున్న వైనం

  • కంటైన్మెంట్‌ ‌జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో పోలీసుల చర్యలు
  • తమిళనాడులోని ఎంజీఆర్‌ వీధిలో దినసరి కూలీల నిరసన 
  • దేశంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తోన్న ప్రజలు
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులతో గొడవ పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.

కంటైన్మెంట్‌ ‌జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల నుంచి ప్రజలను బయటకు వెళ్లనివ్వట్లేదు. అలాగే, బయటి నుంచి లోపలికి ఎవ్వరినీ వెళ్లనివ్వట్లేదు. నిత్యావసర సరుకులను ప్రభుత్వమే ఆయా ప్రాంతాల వారికి అందిస్తోంది.

ఈ నేపథ్యంలో తమిళనాడులోని మధురై, యగప్ప నగర్‌లోని ఎంజీఆర్‌ వీధిలో దినసరి కూలీలు నిరసనకు దిగారు. గుంపులు గుంపులుగా వచ్చి వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. తమ వద్ద డబ్బులేదని, నిత్యావసర సరుకులు కొనుక్కోవాల్సి ఉందని అంటున్నారు.

కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఎంజీఆర్‌ వీధిని ఇప్పటికే కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన పోలీసులు, ఆ వీధికి సీల్ చేశారు. ఈ నేపథ్యంలో కూలీలంతా గుంపులుగా బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే.

దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. త్రిపురలోని అగర్తలా కూరగాయల మార్కెట్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.  కర్ణాటకలోని హుబ్లిలోని ఓ కూరగాయల మార్కెట్లో ప్రజలు సామాజిక దూర నిబంధనను ఉల్లంఘిస్తూ కూరగాయలు కొంటూ కనపడ్డారు. ఆ రాష్ట్రంలో ఇప్పటికి 214 కేసులు నమోదయ్యాయి. 


More Telugu News