హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న శ్రీకాకుళం వాసి అరెస్ట్

  • పగలు రెక్కీ.. రాత్రి చోరీ
  • 1999 నుంచి చోరీలు మొదలు
  • నిందితుడి నుంచి 72 తులాల బంగారం, రూ. 4 లక్షల నగదు స్వాధీనం
పగలు రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాడికి హైదరాబాద్ పోలీసులు బేడీలు వేశారు. రాచకొండ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలాకి అప్పలనాయుడు (41) డ్రైవర్‌గా పనిచేస్తూ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో ఉంటున్నాడు. ఉదయం కారులో తిరుగుతూ కాలనీల్లోని ఇళ్లను గమనిస్తాడు. అనంతరం రాత్రి ఆ ఇళ్లలోకి చొరబడి దోచుకుని పరారవుతాడు. 1999 నుంచి 2012 మధ్య హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలా 18 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు.

రాచకొండ కమిషనరేట్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2019 నుంచి గత నెల వరకు మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 24 చోరీలకు పాల్పడ్డాడు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్న మీర్‌పేట పోలీసులు 72 తులాల బంగారం, కారు, రెండు టీవీలు, రూ. 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News