పోలీసులు వస్తున్నారని పరుగు పెట్టిన కూలీ.. గుండెపోటుతో మృతి
- అమరావతి ప్రాంతంలోని రాయపూడిలో ఘటన
- పోలీసులపై బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ
- జాఫర్ మృతితో తమకు సంబంధం లేదన్న పోలీసులు
పోలీసుల భయంతో పరుగులు తీసిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో జరిగింది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఊరి చివర ఉన్న చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి అందరూ ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఈ క్రమంలో షేక్ జాఫర్ అనే 55 ఏళ్ల కూలీ గుండెపోటుతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కారణంగా జాఫర్ మృతి చెందాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలను ఇంటికి వెళ్లాలని తుళ్లూరు కానిస్టేబుల్ రామయ్య చెప్పారని, దీంతో వారంతా పరుగులు తీశారని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. వారిని చూసి చెట్ల కింద కూర్చున్న వారు కూడా పరుగులు తీశారని, ఈ క్రమంలోనే జాఫర్ గుండెపోటుకు గురై మృతి చెందాడని ఆయన వివరించారు.