పూర్తి రిపోర్ట్ రాక ముందే కొత్తగూడెం డీఎస్పీ డిశ్చార్జ్.. కొత్తగూడెం పరిగెత్తిన వైద్యులు!
- కుమారుడి నుంచి వైరస్ ను అంటించుకున్న డీఎస్పీ
- ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చికిత్స
- డిశ్చార్జ్ తరువాత పాజిటివ్ వచ్చిన శాంపిల్
కరోనా వ్యాధిసోకి ఆసుపత్రిలో చేరిన కొత్తగూడెం డీఎస్పీ షేక్ అలీ ఆరోగ్యానికి సంబంధించిన తుది నివేదిక రాకముందే ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని ఐసొలేషన్ లో ఉంచకుండా, అతని ద్వారా వైరస్ ను అంటించుకున్న షేక్ అలీ ఉదంతం గత నెలలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆయన్ను చెస్ట్ హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స జరుపుతున్న వైద్యులు, ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ, గురువారం నాడు ఆయన శాంపిల్స్ గాంధీ ఆసుపత్రికి పంపారు.వాటిలో ఒకటి నెగెటివ్ రాగా, వెంటనే ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అదే రోజు రెండో శాంపిల్ రిజల్ట్, పాజిటివ్ రాగా, అధికారులు హైరానా పడి, ఆయన కోసం గాలించారు.
అప్పటికే ఆయన కొత్తగూడెంలోని తన ఇంటికి చేరుకోవడంతో, ఛాతీ ఆసుపత్రి వైద్య బృందం అక్కడికి వెళ్లి ఆయనను తిరిగి నగరానికి తీసుకుని వచ్చారు. మొత్తం ఘటనపై ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ వివరణ ఇస్తూ, తొలి శాంపిల్ నెగెటివ్ వచ్చిన తరువాతనే డిశ్చార్జ్ చేశామని, రెండో శాంపిల్ పాజిటివ్ రావడంతో, ముందు జాగ్రత్తగా, తిరిగి ఆసుపత్రికి తీసుకుని వచ్చామని తెలిపారు. ప్రస్తుతం అలీని ఐసోలేషన్ వార్డులో ఉంచామని స్పష్టం చేశారు. రెండో శాంపిల్ రిజల్ట్ పరిశీలించకుండానే ఆయన్ను ఇంటికి పంపిన అధికారులపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.