ప్రభుత్వాలు సరే... ప్రజలు కూడా ప్రాథమిక విధులు పాటించాలి: బాంబే హైకోర్టు

  • లాక్ డౌన్ తో స్థంభించిపోయిన దేశం
  • వలసకార్మికులు, కూలీల సమస్యలపై పిటిషన్
  • నిబంధనల ఉల్లంఘన సర్వసాధారణం అయిందన్న న్యాయమూర్తి
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు ప్రభావశీల చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎలా ఆశిస్తారో, ప్రజలు తమ ప్రాథమిక విధులను పాటించాలని ప్రభుత్వాలు ఆశించడం కూడా సబబేనని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ అభిప్రాయపడింది. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, ఆరోగ్య సిబ్బంది వెతలపై నమోదైన ఓ సుమోటో పిటిషన్ ను విచారించే క్రమంలో జస్టిస్ పీబీ వరాలే ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనాపై పోరులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు, మార్గదర్శకాలు జారీ చేశాయని, గుమికూడవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశాయని జస్టిస్ వరాలే ప్రస్తావించారు. అయితే, ఈ నిబంధనలను చాలామంది ప్రజలు ఉల్లంఘించడం పరిపాటిగా మారిందని, కొందరు ప్రజలు సామాజిక, మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పౌరుడు తన ప్రాథమిక విధులను పాటించాలని హితవు పలికారు. చాలా సందర్భాల్లో పౌరులు తమ ప్రాథమిక హక్కుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తుంటారని, కానీ తమ ప్రాథమిక విధుల వద్దకు వచ్చేసరికి విస్మరిస్తుంటారని జస్టిస్ వరాలే అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేశారు.


More Telugu News