లాక్‌డౌన్ వేళ మెట్రో వాసుల ‘రేడియో రాగం’!

  • మెట్రో నగరాల్లో  రేడియో వింటున్న 80 శాతం మంది
  • విశ్వసనీయతలో టీవీ కంటే రేడియోకే ప్రజల మొగ్గు
  • ఏజే రీసర్చ్ సంస్థ సర్వేలో వెల్లడి
కరోనా వైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో కోట్లాది మంది ప్రజలు ఇళ్ల నుంచి  కాలు బయట పెట్టలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బయట ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలామంది రేడియోపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇటీవల జరిగిన ఓ సర్వే ద్వారా తెలిపింది.

పైగా, మెట్రో నగరాల్లోని 82 శాతం మంది ప్రజలు లాక్‌డౌన్‌లో రేడియో వింటున్నారని వెల్లడైంది. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, పూణే, హైదరాబాద్ నగరాల్లో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారిపై చేసిన సర్వేలో ఈ విషయం గుర్తించినట్టు  ఏజే రీసర్చ్ పార్ట్‌నర్స్ అనే మార్కెట్ కన్సల్టింగ్ సంస్థ తెలిపింది.

 టీవీ కంటే రేడియో సమాచారాన్నే ప్రజలు ఎక్కువ విశ్వసిస్తున్నారని ఆ సంస్థ చెప్పింది. విశ్వసనీయత విషయంలో టీవీలకు 5.74 స్కోరు ఇస్తే.. రేడియోకు 6.27 స్కోరు ఇచ్చారని, 6.44 స్కోరుతో ఇంటర్నెట్ ముందుందని తెలిపింది. ఇక, లాక్‌డౌన్‌లో ఏకంగా 51 మిలియన్ల ప్రజలు రేడియో వింటున్నారని, అదే సమయంలో 56 మిలియన్ల ప్రజలు టీవీ చూస్తున్నారని చెప్పింది. 57 మిలియన్ల మందికి సోషల్ మీడియా చేరువగా ఉందని గుర్తించింది.

ఈ సర్వే ప్రకారం ఇంట్లో ఉండి రేడియో వినే వారి సంఖ్య 64 నుంచి ఏకంగా 86 శాతానికి పెరిగింది. లాక్‌డౌన్‌లో రోజుకి సగటున 2.36 గంటల సమయం పాటు రేడియో వింటున్నారు. టీవీ తర్వాత రెండో ప్లేస్ రేడియోదే.  


More Telugu News