కరోనా సంక్షోభం నేపథ్యంలో గ్రూప్ కంపెనీలకు కీలక సూచనలు చేసిన టాటా యాజమాన్యం

  • కరోనా ప్రభావంతో ఆర్థికరంగం కుదేలు
  • క్షీణించిన ఉత్పాదకత
  • తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా చూసుకోవాలన్న టాటా సన్స్ చైర్మన్
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక రంగంపైనా పెను ప్రభావం చూపుతోంది. ఉత్పాదకత పడిపోవడంతో అనేక కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. టాటా సన్స్ పరిధిలోని అనేక సంస్థలు ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేశాయి. టాటాలకు చెందిన స్టీల్, ఆటోమొబైల్ పరిశ్రమల ఉత్పత్తి స్తంభించడమే కాదు విక్రయాలు కూడా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో టాటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు గ్రూప్ కంపెనీలన్నీ తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని, 2020-21 ఆర్థిక సంవత్సరం కోసం ఇప్పటినుంచే నగదు భద్రపరచుకోవాలని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సూచించారు.

అన్ని గ్రూప్ కంపెనీల సీఈవోలు మూలధన వ్యయాలపై ఆచితూచి అడుగేయాలని, వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల కోసం తాత్కాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రశేఖరన్ పిలుపునిచ్చారు. ఆయా వ్యాపారాల మధ్య సహకారం పెంపొందించుకోవాలని, డిజిటలైజేషన్ ను మరింత విస్తరించి లావాదేవీలు నిర్వహించుకోవాలని సీఈవోలకు స్పష్టం చేశారు.


More Telugu News