ఏపీలో ఇది ఉపశమనం కలిగించే అంశం: కరోనాపై ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

  • ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగాన్ని జగన్ ప్రారంభించారు
  • రోజుకు 2,000 తయారు చేసే సామర్థ్యం
  • మే మొదటి వారం లోపు ఏపీలో మొత్తం 25,000 కిట్ల తయారీ
కరోనా నియంత్రణ కోసం పరీక్షలు చేయడానికి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలో తయారు చేసిన విషయం తెలిసిందే. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయ్యికిట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా 50 నిమిషాల్లోనే టెస్టింగ్‌ రిపోర్టు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 'ఏపీ సీఎం జగన్‌ ఏపీలో తయారైన కిట్ల వినియోగాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి భయం పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రజలకు  ఇది భారీ ఉపశమనం కలిగేంచే విషయం. ఈ కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను రోజుకు 2,000 తయారు చేసే సామర్థ్యాన్ని సాధించాం. మే మొదటి వారం లోపు ఏపీలో మొత్తం 25,000 కిట్లను తయారు చేస్తారు' అని తెలిపారు.

కాగా, ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేసేందుకు అవకాశముంటుంది. కరోనాను అరికట్టేందుకు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సర్వే చేసి కరోనా లక్షణాలతో ఉన్న దాదాపు 5,000 మందిని గుర్తించింది. వారిలో దాదాపు 2,000 మందికి పరీక్షలు అవసరమని గుర్తించిన అధికారులు మొదట వారికే పరీక్షలు చేయనున్నారు.


More Telugu News