ఈ వార్తలతో పేదలు మరింత ఆందోళన చెందుతున్నారు.. జగన్ గారు ఆదుకోవాలి: నారా లోకేశ్

  • లాక్ డౌన్ తో ప్రజలు అల్లాడుతున్నారు
  • పనులు, తిండి లేని పరిస్థితి ఉంది
  • పేదలు, రైతులను ఆదుకోవాలి
లాక్ డౌన్ తో పేద ప్రజలు అల్లాడుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లాక్ డౌన్ ను పొడిగిస్తారనే వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని చెప్పారు. లాక్ డౌన్ వల్ల పనులు లేవని, ఎక్కడికీ కదలలేని పరిస్థితి ఉందని... తినడానికి తిండి కూడా లేదని అన్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పేద కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ ఆదుకోవాలని కోరారు. తక్షణమే రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోవాలని విన్నవించారు.

రైతుల కష్టం కూడా వర్ణనాతీతంగా ఉందని... పంటకు మద్దతు ధర, రవాణా సౌకర్యం లేవని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని చెప్పారు. అకాల వర్షాలు కూడా రైతుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి... రైతులకు తక్షణమే నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కోరారు.


More Telugu News