మాస్కు లేకుండా బయటికొస్తే గుంటూరులో రూ. వెయ్యి జరిమానా

  • ఉదయం 6 నుంచి 9 గంటల వరకే  ప్రజలకు అనుమతి
  • ఆ సమయంలోనూ మాస్కులు తప్పనిసరి
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి అనుమతి లేదన్న కలెక్టర్
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌లో ప్రజలు బయటికి రాకుండా, అత్యవసర పని మీద వచ్చినా కూడా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన గుంటూరు జిల్లా యంత్రాంగం.. ముఖానికి మాస్కు లేకుండా  ఎవరైనా బయటికి వస్తే రూ. వెయ్యి వరకూ జరిమానా విధించాలని నిర్ణయించింది.

కరోనా కేసులు పెరుగుతున్నందున  లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. అవసరం ఉన్న వారు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకే బయటకు రావాలని సూచించారు. అప్పుడు కూడా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపు ఆఫీసులకు వెళ్లి.. సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.


More Telugu News