హర్యానా వైద్య సిబ్బందికి తీపికబురు.. జీతాలు రెట్టింపు!

  • ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ ప్రకటన
  • కోవిడ్‌-19 విపత్తు నుంచి బయటపడే వరకు కొనసాగింపు
  • కష్టకాలంలో వారి సేవలకు హ్యాట్సాప్‌ అని వ్యాఖ్య
కష్టకాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా వైరస్‌తో పోరాడుతున్న వైద్యసిబ్బందికి హర్యానా ప్రభుత్వం తీపికబురు అందించింది. కోవిడ్‌-19 సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, అంబులెన్స్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రెట్టింపు జీతాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని వైద్యులు, మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఆయుర్వేద విభాగాల అధికారులతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సీఎం ఈ ప్రకటన చేశారు.

‘విపత్తుపై సైనికుల్లా పోరాడుతున్న వైద్యులకు, సిబ్బందికి  కరోనా విపత్తు నుంచి పూర్తిగా బయటపడే వరకు ఈ విధానం కొనసాగుతుంది’ అని సీఎం ప్రకటించారు. కరోనాపై పోరాడుతున్న పలు విభాగాల వారికి, కేంద్రం ప్రకటించిన బీమా పథకం పరిధిలోకి రాని వారికి ఆయా ఉద్యోగ స్థాయిని బట్టి రూ.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రిస్క్ పరిహారం అందజేయనున్నట్లు అంతకు ముందే సీఎం ప్రకటించారు.

 తాజాగా వేతనాలను రెట్టింపు చేయనున్నట్లు తెలిపి సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. హర్యానా రాష్ట్రంలో నిన్నటివరకు 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు బాధితులు చనిపోయారు.


More Telugu News