ప్రియ మిత్రుడా, మా ప్రజలంతా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు!: మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ట్వీట్

  • ఇజ్రాయెల్ కు 5 టన్నుల మందులు పంపిన భారత్
  • మంగళవారం ఇజ్రాయెల్ కు చేరుకున్న సామగ్రి
  • దేశ ప్రజల తరపున మోదీకి ధన్యవాదాలు తెలిపిన నెతన్యాహు
కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలను మోగిస్తున్న వేళ... ప్రపంచ వ్యాప్తంగా భారత్ పేరు మారుమోగుతోంది. దీనికి కారణం కరోనా నివారణకు ఉపయోగిస్తున్న మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఈ డ్రగ్ నిల్వలు భారత్ లోనే అత్యధికంగా ఉన్నాయి. దీంతో అగ్ర దేశాలు సహా పలు దేశాలు ఆ డ్రగ్ ను సరఫరా చేయాలని కోరుతున్నాయి. భారత్ కూడా మానవతా ధృక్పధంతో డ్రగ్ ను సరఫరా చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ కు కూడా ఈ డ్రగ్ ను భారత్ భారీ ఎత్తున సరఫరా చేసింది.

ఈ నేపథ్యంలో తన ప్రియ మిత్రుడు, భారత ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. 'మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోదీ... ఇజ్రాయెల్ కు క్లోరోక్విన్ పంపినందుకు ధన్యవాదాలు. ఇజ్రాయెల్ ప్రజలందరూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు' అని ట్వీట్ చేశారు.

భారత్, ఇజ్రాయెల్ మధ్య ముందు నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ బంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశానికి 5 టన్నుల మందులను భారత్ పంపించింది. ఇందులో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా ఉంది. ఈ మందులు ప్రత్యేక విమానం ద్వారా ఈ మంగళవారం ఇజ్రాయెల్ చేరుకున్నాయి. సాయం చేయాలని నెతన్యాహు విన్నవించిన ఐదు రోజుల్లోనే వీటిని అక్కడకు పంపించడం గమనార్హం.

ఇజ్రాయెల్ లో ఇప్పటి వరకు 10 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 86 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 121 మంది వెంటిలేటర్లపై ఉన్నారు.


More Telugu News