ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు నిలిపివేత... డబ్బులు వెనక్కి!

  • 15 నుంచి రిజర్వేషన్లు ఇచ్చిన ఆర్టీసీ
  • ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటన
  • ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తరువాతే తిరిగి మొదలు
15వ తేదీ బుధవారం నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ, అన్ని టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలున్న నేపథ్యంలోనే రిజర్వేషన్లను నిలిపివేసినట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదును తిరిగి వారి బ్యాంకు ఖాతాకు వేయనున్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తరువాత మాత్రమే, తిరిగి రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది.

కాగా, నాలుగు రోజుల క్రితం 15వ తేదీ నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కాగా, ఏసీ బస్సులు మినహా, మిగతా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ సర్వీసులకు రిజర్వేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారంతా, తమ తమ స్వస్థలాలకు చేరుకునేందుకు పెద్దఎత్తున రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇప్పుడు అవన్నీ రద్దయిపోయాయి.

వాస్తవానికి దూర ప్రాంతాల నుంచి 15వ తేదీ నుంచి సర్వీసులు నడిపించాలంటే, 14 రాత్రి నుంచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు బయలుదేరాలి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు బస్సులను పంపాలని నిర్ణయించారు కూడా. అయితే, లాక్ డౌన్ పొడిగింపునకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపడంతో రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


More Telugu News