అత్యవసర పరిస్థితుల్లో ప్రజారవాణాకు ఓలా క్యాబ్ లు... ఏపీ ప్రభుత్వం అనుమతి

  • నగరాల్లో అత్యవసర సేవల కోసం ఓలా క్యాబ్ లు
  • కరోనా లక్షణాలు లేని ఇతర రోగుల కోసమే ఈ క్యాబ్ లు
  • క్యాబ్ సేవలు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికీ వర్తింపు
కరోనా వైరస్ భూతాన్ని తరిమికొట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. అయితే, విపత్కర పరిస్థితుల్లో ప్రజారవాణాకు ఓలా క్యాబ్స్ సేవలు వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నగరాల్లో అత్యవసర వైద్య సేవల కోసం ఓలా క్యాబ్ లను అనుమతించాలని ప్రభుత్వం తీర్మానించింది. అత్యవసర వైద్య రవాణా సేవలకు ఓలా క్యాబ్స్ ముందుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది.

దీనిపై రాష్ట్ర కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ, ఓలా సేవలపై రవాణా శాఖ, పోలీసు శాఖ చర్చించి నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించారు. డయాలసిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ తదితర రోగులకు ఓలా సేవలు ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. కరోనా లక్షణాలు లేని వారికే ఓలా క్యాబ్ ల ద్వారా రవాణాకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. రోగులు వారి ఇంటి నుంచి ఆసుపత్రులకు రాకపోకల వరకే క్యాబ్ లను అనుమతిస్తామని వివరించారు.

ఓలా ఇప్పటికే ఈ తరహాసేవలు కర్ణాటకలో అందిస్తోందని, రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా విశాఖలో ఓలా క్యాబ్ ల సేవలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఓలా క్యాబ్ ల సేవలు వాడుకోవచ్చని, అయితే వైద్యులు, ఇతర సిబ్బంది ఇంటి నుంచి ఆసుపత్రికి రాకపోకలు సాగించేంత వరకే క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయని కృష్ణబాబు వెల్లడించారు. ఓలా క్యాబ్ లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని, కారులో భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.


More Telugu News