కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని నిలిపివేసిన ఫ్రెంచ్ వైద్యులు

  • కరోనా చికిత్సలో కీలకంగా మారిన క్లోరోక్విన్
  • సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్న ఫ్రాన్స్ డాక్టర్లు
  • స్వీడన్ లోనూ క్లోరోక్విన్ పై విముఖత
ప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతుండగా, మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం అందరికీ ఆశాదీపంలా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ మాత్రల కోసం బెదిరింపులకు దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఫ్రాన్స్ లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకూడదని నైస్ నగరంలోని యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు తీర్మానించారు.

ఇది ప్రధానంగా మలేరియా చికిత్సలో వాడతారని, దీన్ని కరోనా బాధితులపై ప్రయోగించడం ద్వారా దుష్పరిణామాలు సంభవించే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. ఇది తీవ్రస్థాయిలో గుండెపోటుకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఓ కరోనా రోగికి హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడిన అనంతరం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష చేస్తే, ఆ రోగి హృదయస్పందనలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయని, అందుకే ఇకపై ఈ మందును కరోనా చికిత్సలో వాడబోమని అక్కడి డాక్టర్లు తేల్చి చెప్పారు.

అటు, స్వీడన్ లోనూ పలు ఆసుపత్రులు క్లోరోక్విన్ వాడకం నిలిపివేశాయి. స్వీడన్ లోని స్టాక్ హోమ్ నగరానికి చెందిన కార్ల్ సైడెన్ హాగ్ అనే వ్యక్తికి కరోనా సోకగా, రోజుకు రెండు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే  ఆ మాత్రలు వేసుకున్నప్పటి నుంచి సైడెన్ హాగ్ తీవ్రమైన తలనొప్పి, దృష్టి మందగించడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల బారినపడ్డాడు.

ఇప్పటివరకు కరోనా వైరస్ కు నిర్దిష్ట ఔషధం అంటూ లేకపోవడంతో, ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ప్రత్యామ్నాయ ఔషధాలపై ఆధారపడుతున్నారు. వీటన్నింటిలోకి మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వెల్లడైంది. కానీ, ఫ్రాన్స్, స్వీడన్ వైద్యులు మాత్రం ఈ మాత్రలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


More Telugu News