లాక్‌డౌన్‌లో ఫీజు అడిగిన స్కూళ్లకు పంజాబ్ ప్రభుత్వం నోటీసులు

  • వారం రోజుల్లో సంతృప్తికర సమాధానం ఇవ్వకుంటే గుర్తింపు రద్దు
  • ఫీజులు చెల్లింపునకు లాక్‌డౌన్ ముగిశాక 30 రోజుల గడువు ఇవ్వాలని ఇది వరకే ఆదేశం
  • వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని ఉత్తర్వులు
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించడంతో అన్ని కార్యక్రమాలకు బ్రేక్ పడింది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. ఇలాంటి సమయంలో స్కూలు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేసిన 38  ప్రైవేట్ పాఠశాలలకు పంజాబ్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

గురువారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 15 స్కూళ్లకు నోటీసులు పంపించామని విద్యా శాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా తెలిపారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఫీజులు అడగకూడదన్న ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించాయని చెప్పారు. షోకాజ్‌పై సమాధానం చెప్పేందుకు ఏడు రోజుల గడువు ఇచ్చినట్టు తెలిపారు. ఒకవేళ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే మాత్రం సదరు విద్యాసంస్థల గుర్తింపు, ఎన్‌ఓసీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.

 లాక్‌డౌన్ సమయం ముగిసేవరకు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రాన్స్‌పోర్టు, పుస్తకాల కోసం ఫీజులు వసూలు చేయకూడని ఆయన స్పష్టం చేశారు. అలాగే, 2020-21 సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఫీజులు చెల్లించేందుకు కనీసం 30 రోజుల గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే, ఈ సమయంలో విద్యార్థుల నుంచి ఎలాంటి ఆలస్య, అపరాధ రుసుం కూడా డిమాండ్ చేయకూడదని చెప్పింది.


More Telugu News