సిగ్గు అనిపించడం లేదా?: విజయసాయిరెడ్డి ట్వీట్ కు బుద్ధా వెంకన్న కౌంటర్

  • దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్న విజయసాయి
  • ఏడాదిలో 60 సార్లు కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్నారన్న వెంకన్న 
  • ఏ1, ఏ2లను చూసి అబద్ధమే సిగ్గుపడుతోందని విమర్శ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుధ్ధా వెంకన్న అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ ఉదయం విజయసాయిరెడ్డి ... ‘కరోనా సేవల్లో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. పరీక్షలు, చికిత్సకు మార్గదర్శకంగా నిలుస్తోంది. మీ పాలనా కాలంలా గ్రాఫిక్స్‌లేవు. గాలి వార్తలు లేవు. పనులు మాత్రమే జరుగుతున్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక్కడితో అయిపోలేదని, ఇంకా నాలుగేళ్ల కాలం ఉందని, ఇంకా మరెన్నో వండర్స్‌ చూడాల్సి ఉంటుంది కావున కుల మీడియా, దాని బాసు గుండె దిటవు చేసుకోవాలని అన్నారు. విజయసాయి ట్వీట్ పై బుధ్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.

రూ. 4 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి, మరుగుదొడ్లను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేసుకున్నారని వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రంలో డాక్టర్లు కరోనా బారిన పడుతుంటే... జగన్ గారు కరోనాను ఎదుర్కొన్న ధీరుడు అంటూ అమెరికాలో ప్రకటనలు ఇవ్వడానికి సిగ్గు అనిపించడం లేదా? అని విమర్శించారు.

చెత్త నిర్ణయాలతో ఏడాదిలోనే  60 సార్లు కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో వండర్స్ చూడటం నిజమేనని... ప్రపంచంలోనే అసమర్థ, దద్దమ్మ సీఎంగా నిలవడం వండరే మరి అని అన్నారు. ఎన్నికలే ముఖ్యం అన్న ముఖ్యమంత్రి కరోనా నివారణలో దేశానికి ఆదర్శమా? అని ప్రశ్నించారు. ఏ1, ఏ2లను చూసి అబద్ధమే సిగ్గుపడుతోందని అన్నారు.


More Telugu News