ఢిల్లీలో మరో 13 జోన్లు అష్ట దిగ్బంధనం

  • నోయిడాలో 22, ఘజియాబాద్‌లో 13 ప్రాంతాలు కూడా
  • కరోనా వ్యాప్తి కట్టడికి ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల నిర్ణయం
  • ఆయా  ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం
కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకూ విజృంభిస్తోంది. ‘తబ్లిగీ జమాత్’ కేంద్ర స్థావరంగా కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానికి సమీపంలోని ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దాంతో  వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు  కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఢిల్లీలోని 13 ప్రాంతాలు, నొయిడాలో 22, ఘజియాబాద్‌లో మరో 13  హాట్ స్పాట్లను బుధవారం అర్ధరాత్రి నుంచి అష్ట దిగ్బంధనం చేశాయి. నోయిడా, ఘజియాబాద్‌ ప్రాంతాలను ఈ నెల 15వ తేదీ వరకూ మూసి వేయాలని నిర్ణయించగా.. ఢిల్లీలోని హాట్ స్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఇప్పటికే తూర్పు ఢిల్లీ జిల్లా అధికారులు ఎనిమిది ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా గుర్తించారు. దాంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ప్రాంతాల్లోని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కానున్నారు.

నోయిడాలో సీల్ చేసిన ప్రాంతాల్లో ఏడు రెసిడెన్షియల్ సెక్టార్లు, 11 హౌసింగ్ సొసైటీలు కూడా ఉన్నాయి. నోయిడాలో ఇప్పటిదాకా 62 కరోనా కేసులు నమోదయ్యాయి. 25 కేసులు ఉన్న ఘజియాబాద్‌లో సీల్ చేసిన 13 ప్రాంతాల్లో నాలుగు హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో దిగ్బంధం చేసిన ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు. మెడిసిన్, నిత్యావసర సరుకులు ఇళ్లకే పంపిస్తారు. ఈ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. కనీసం మీడియాను కూడా ఈ ప్రాంతాల్లోకి అనుమతించరు.


More Telugu News