ముఖానికి ముసుగు వేసుకుని వెళ్లి.. ముంబై మురికివాడలోని పేదలకు డబ్బు పంచిన పాక్ క్రికెట్ దిగ్గజం!

  • ఇండియా నుంచి నేను ఎంతో ప్రేమను పొందాను
  • నా సంపాదనలో 30 శాతాన్ని నా స్టాఫ్ కు ఇస్తున్నా
  • ఇదంతా మానవత్వంలో భాగమే
పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ తన ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటాడు. కరోనా పంజా విసిరిన నేపథ్యంలో, ఆఫ్రిదీ ఛారిటీకి భారత క్రికెట్ అభిమానులు విరాళాలను ఇవ్వాలని ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కోరారు. ఈ విన్నపంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

దీనిపై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందిస్తూ, వారిని విమర్శించడం మానవత్వం కాదని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, మతం అనేవి ప్రధానం కాదని... మానవత్వమే ముఖ్యమని చెప్పాడు. కరోనాపై పోరాటానికి దేశం, మతాన్ని పక్కన పెట్టేయాలని... మానవత్వంతో వ్యవహరించాలని విన్నవించాడు.

భారత్ నుంచి తాను పొందిన ప్రేమ చాలా గొప్పదని... ఈ విషయాన్ని తాను తొలిసారి చెపుతున్నానని అఖ్తర్ తెలిపాడు. టీవీ షోల ద్వారా ఇండియాలో తాను సంపాదించిన దానిలో 30 శాతం తనతో పాటు పని చేస్తున్నవారికి ఇస్తున్నానని... వీరిలో తన డ్రైవర్ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు ఉన్నారని చెప్పాడు. తక్కువ జీతం వచ్చే వారికి సాయం చేస్తున్నానని చెప్పాడు.

మరోవైపు ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఉన్న పేదలకు అఖ్తర్ సాయం చేశాడు. ముఖాన్ని గుడ్డతో కప్పుకుని వెళ్లిన ఆయన... అక్కడున్న వారికి డబ్బును పంచాడు. తనకు ఎంతో ప్రేమను పంచిన ప్రజలకు సాయం చేయడంలో ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఇండియాలో తాను ఎంతో సంపాదిస్తున్నానని... అందులో కొంత ఇక్కడి ప్రజలకు ఖర్చు చేయడం మానవత్వంలో భాగమేనని తెలిపాడు.


More Telugu News