మీ బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు: మోదీకి ట్రంప్ ట్వీట్

  • తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కావాలన్న ట్రంప్
  • నిషేధాన్ని ఎత్తివేసిన మోదీ ప్రభుత్వం
  • మోదీని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన ట్రంప్
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రస్తుతం వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎత్తివేయడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమన్న ట్రంప్.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాటంలో కేవలం భారదేశానికే కాకుండా మొత్తం మానవాళికి మీరు చేస్తున్న సాయం విషయంలో మీ బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ట్రంప్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కావాలని కోరారు. ఆయన అభ్యర్థనకు స్పందించిన భారత ప్రభుత్వం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు మరికొన్ని ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు.


More Telugu News