ఈ ఆరు నెలలు మన జీవితంలోనే లేవనుకోవాలి: పుల్లెల గోపీచంద్

  • ఇది అందరికీ కష్ట కాలమే
  • అన్ని రంగాల వారికి నష్టం జరుగుతోంది
  • ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచన
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు దేశంలో అందరూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.  ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోత ఎదుర్కోవడాన్ని జీర్ణించుకోవడం కష్టమైన విషయమన్నారు. అయితే, ఇది అందరికీ కఠిన సమయమే అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ గుండె నిబ్బరం కోల్పోవద్దన్నారు.  ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను  పాటించాలని కోరారు.  ఈ ఆరు నెలలు మన జీవితంలోనే లేవని అనుకొని ముందుకెళ్లాలని సూచించారు.

‘ఈ సంక్షోభ సమయంలో  క్రీడలే కాదు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇలాంటప్పుడే అందుబాటులోని వనరులను వాడుకుంటూ మనల్ని మనం మానసికంగా, శారీరకంగా బలంగా ఉంచుకోవాలి.  ఈ ఆరు నెలలు మన జీవితంలో లేవు అని అందరూ అనుకోవాలి. మనకు మంచిది అనిపించిన దారిలో ముందుకెళ్లాలి. పుస్తకాలు చదవడం, లేదంటే మెడిటేషన్ చేస్తూ సానుకూలంగా ఉండాలి . గడచిన వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు కాబట్టి  ప్రజలు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కొంతకాలం ఓర్పుగా ఉండాల్సిందే’ అని గోపీచంద్ పేర్కొన్నారు.


More Telugu News