‘విజ్డన్’ లీడింగ్ క్రికెటర్​గా బెన్ స్టోక్స్!

  • వన్డే ప్రపంచ కప్ హీరోకు అరుదైన గౌరవం
  • ఉత్తమ మహిళా క్రికెటర్ గా ఎలైస్‌ పెర్రీ
  • భారత క్రికెటర్లకు నిరాశే
మూడేళ్లుగా ‘విజ్డన్’ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ జోరుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ్ బెన్‌ స్టోక్స్ బ్రేక్ వేశాడు. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన బెన్ స్టోక్స్ ను  ప్రఖ్యాత మేగజైన్ విజ్డన్  2019కి గాను  ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేసింది. బుధవారం విడుదలైన  2020 ‘విజ్డన్’ క్రికెటర్స్ అల్మనాక్‌లో స్టోక్స్‌ను ఈ పురస్కారం వరించింది. దాంతో,  ఆండ్రూ ఫ్లింటాఫ్ (2005) తర్వాత ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్ రెండో ఆటగాడిగా బెన్ నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన బెన్ స్టోక్స్‌ అనంతరం యాషెస్‌ సిరీస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీతో  తమ జట్టును గెలిపించాడు.

ఇలా వారాల వ్యవధిలోనే స్టోక్స్ తన కెరీర్ లో చిరకాలం గుర్తిండిపోయే రెండు ఇన్నింగ్స్‌లు ఆడాడని విజ్డన్ ఎడిటర్ లారెన్‌ బూత్ కొనియాడారు. ఐసీసీ  జనవరిలో ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో  స్టోక్స్  బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక, వరల్డ్ కప్ ఫైనల్లో  సూపర్ ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్... విజ్డన్  ఎంపిక చేసిన ఐదుగురు క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.  ఈ జాబితాలో అతనితో పాటు ఆస్ట్రేలియా  ఆటగాళ్లు  పాట్  కమిన్స్, మార్నస్ లబుషేన్, ఎలైస్ పెర్రీ, దక్షిణాఫ్రికాలో పుట్టిన ఇంగ్లిష్ కౌంటీ టీమ్ ఎసెక్స్ స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా ఉన్నారు.

ఎలైస్ పెర్రీ ఉత్తమ మహిళా క్రికెటర్ గా కూడా నిలిచింది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నుంచి ఆమె ఈ టైటిల్ కైవసం చేసుకుంది. విజ్డన్ పురస్కారాల్లో ఈసారి భారత్‌ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం గమనార్హం.


More Telugu News